అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమీషన్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్నికల మీడియా కవరేజీ పాసులు పొందిన మీడియా ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా పాటిస్తూ ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం సర్క్యులర్ నెం. 184/SEC-F1/2026ను జారీ చేసింది.దీని ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు కవరేజీలో మీడియా ప్రతినిధులు పాటించాల్సిన విధానం పై ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్గదర్శకాలు:
సిబ్బంది పరిమితి: ఏ సమయంలోనైనా పోలింగ్ కేంద్రం లేదా లెక్కింపు కేంద్రం లోపలికి ఒక రిపోర్టర్ మరియు ఒక ఫోటోగ్రాఫర్ / వీడియోగ్రాఫర్ కి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఓటు రహస్యం (Secrecy of Ballot): ఏ ఒక్క ఓటరు యొక్క ఓటు రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కాకూడదు. నమోదు చేసిన ఓట్లను గానీ, బ్యాలెట్ పేపర్లను గానీ ఫోటోలు తీయడం లేదా ఆడియో-వీడియో కవరేజ్ చేయడం పూర్తిగా నిషేధించబడింది.
మీడియా రొటేషన్: పోలింగ్, లెక్కింపు ప్రక్రియలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, వివిధ న్యూస్ ఏజెన్సీలు, ఛానళ్లు వంతులవారీగా (turns లో) కవరేజ్ చేసుకోవాలి.
నియామక అధికారుల అధికారాలు: అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి పోలింగ్ కేంద్రాల వద్ద లేదా లెక్కింపు కేంద్రాల వద్ద ఆర్డర్ నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్లు / రిటర్నింగ్ ఆఫీసర్లు అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకునే పూర్తి అధికారం కలిగి ఉంటారు.






