మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

  • జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి
  • జిల్లాలో ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 172 వార్డులకు ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపునకు 18 రూములు, 159 టేబుళ్లు ఏర్పాటు

కడప: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం ఉదయం జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 172 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవసరమైన గదులు, కౌంటింగ్ టేబుళ్లు, కౌంటింగ్ సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి మొత్తం 2,82,176 మేయర్, చైర్‌పర్సన్ ఓట్లు, 1,13,348 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉందని తెలిపారు. మేయర్, చైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపునకు ఐదు గదుల్లో 84 టేబుళ్లను ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించి మొత్తం 12 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అదేవిధంగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు 13 గదుల్లో 75 టేబుళ్లను ఏర్పాటు చేశామని, మొత్తం 36 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

  • బద్వేలు పట్టణానికి సంబంధించి 1,320 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో ఒక గది, ఒక టేబుల్ ఏర్పాటు చేసి రెండు విడతల్లో లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.
  • జమ్మలమడుగు పట్టణంలో 32 వార్డులకు సంబంధించి మేయర్, చైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపునకు 30,206 ఓట్లు ఉండగా, ఒక గదిలో ఎనిమిది టేబుల్లను ఏర్పాటు చేసి నాలుగు విడతల్లో లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. వార్డు సభ్యుల 26,560 ఓట్ల లెక్కింపునకు రెండు గదుల్లో 16 టేబుల్స్ ఏర్పాటు చేసి రెండు విడతల్లో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), ముద్దనూరు రోడ్డును లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
  • కడప నగరపాలక సంస్థ పరిధిలో 66 వార్డులకు సంబంధించి మేయర్ ఓట్ల లెక్కింపునకు 2,13,488 ఓట్లు ఉండగా, మూడు గదుల్లో 66 టేబుల్లను ఏర్పాటు చేసి నాలుగు విడతల్లో లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. వార్డు సభ్యుల 42,640 ఓట్ల లెక్కింపునకు ఒక గదిలో 14 టేబుల్లను ఏర్పాటు చేసి నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఇందుకు ఎంఏఎన్‌యూ పాలిటెక్నిక్ కళాశాలను లెక్కింపు కేంద్రంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
  • మైదుకూరు పట్టణంలో 15 వార్డులకు సంబంధించి 12,491 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఒక గది, 16 టేబుల్లను ఏర్పాటు చేసి 13 విడతల్లో లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.
  • పులివెందుల పట్టణంలో 40 వార్డులకు సంబంధించి మేయర్, చైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపునకు 38,482 ఓట్లు ఉండగా, ఒక గదిలో 10 టేబుల్లను ఏర్పాటు చేసి నాలుగు విడతల్లో లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. వార్డు సభ్యుల 18,566 ఓట్ల లెక్కింపునకు ఒక గదిలో 10 టేబుల్లను ఏర్పాటు చేసి రెండు విడతల్లో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను.. ముద్దనూరు రోడ్డులోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
  • రాజంపేట పట్టణంలో 17 వార్డులకు సంబంధించి 11,065 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు జెడ్పీ ఉన్నత పాఠశాల, మన్నూరు వద్ద ఆరు గదుల్లో 17 టేబుల్లను ఏర్పాటు చేసి 12 విడతల్లో లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు.
  • ఎర్రగుంట్ల పట్టణంలో ఒక వార్డుకు సంబంధించి 706 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు ముద్దనూరు రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఒక గది, ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఒక విడతలో లెక్కింపు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఎంట్రీ కంట్రోలింగ్, ఐడి తనిఖీలు, అవసరమైన బారికేడ్ల ఏర్పాటు వంటి చర్యలను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు నిరంతర నిఘా కొనసాగించేలా సంబంధిత పోలీసు యంత్రాంగం, సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!
Scroll to Top