రోల్‌ప్లే పోటీల్లో మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలకు ప్రథమ స్థానం
మైదుకూరు: నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో అక్టోబరు 30వ తేదీన కడప నగరంలోని గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్యాల పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, మాదకద్రవ్యాల నివారణ, జీవన నైపుణ్యాలు, విలువలు, ఉద్వేగాల సమతుల్యత తదితర సామాజిక అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో భాగంగా మైదుకూరులోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలికల ఉన్నత పాఠశాల మరియు కళాశాలకు చెందిన విద్యార్థినులు రోల్‌ప్లే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తద్వారా తదుపరి స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విజయంపై పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలమ్మ విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.







