కడప: వైఎస్ఆర్ కడపజిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో నవంబర్ 4, 5 తేదీల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న పోలింగ్, అవసరమైతే నవంబర్ 6న రీ-పోలింగ్, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు నవంబర్ 5న స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ గారు తెలిపారు. పోలింగ్ నిర్వహణకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాలకు నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు వర్తిస్తాయన్నారు. అదేవిధంగా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు నవంబర్ 5న సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ కోసం నోటిఫై చేసిన ప్రాంతాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం-1881 ప్రకారం కూడా స్థానిక సెలవు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, అన్ని శాఖల అధికారులు, రాజంపేట సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, విద్యాశాఖ, కార్మిక శాఖ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.






