జగన్‌పై జమ్మలమడుగు ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

పులివెందుల: వైఎస్సార్ కడపజిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పూలంగళ్ల సర్కిల్ లో కూటమి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదినారాయణరెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులివెందుల ప్రజలకు అవసరమైన పనులు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జగన్ హయాంలో పేదలకు ఇళ్లు నిర్మించకపోగా.. ఐదు ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. జగన్‌పై గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడికత్తి ఘటన, మద్యం వ్యవహారం, తిరుమల లడ్డూ అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎర్రబల్లె చెరువుకు నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో బటన్ నొక్కి సంక్షేమ పథకాల నిధుల కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేస్తున్న విమర్శలను కూడా ఆదినారాయణ రెడ్డి తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Scroll to Top