- జిల్లాలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు : 08562-246344, 9849904124 ఏర్పాటు
- క్షేత్ర స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన “మురసు” తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను పరిస్థితులు, జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, సంసిద్ధతపై సోమవారం జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు, మండల తహసీల్దార్లతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. మండలాల వారీగా చెరువు కట్టలు, కాలువ గట్ల పరిస్థితులను పరిశీలించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు, కుంటలు, లోతట్టు ప్రాంతాల వద్ద ప్రత్యేక అప్రమత్తత పాటించాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రిజర్వాయర్లు, నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైనప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ, సచివాలయ స్థాయి వరకు అధికారులు, సిబ్బంది తమ విధి నిర్వహణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలన్నారు. అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలో పోలీసు, అగ్నిమాపక, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.

వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులను అప్రమత్తం చేసి పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పశువులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని మండలాల్లో తహసీల్దార్లు తాత్కాలిక పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన మందులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని, గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక వైద్య సంరక్షణ కల్పిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాను సంబంధిత సమస్యలు, అత్యవసర సహాయం కోసం ప్రజలు కింది ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
- ల్యాండ్‌లైన్: 08562-246344
- మొబైల్: 9849904124
ప్రజలు వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అధికారుల సూచనలు లేకుండా రిజర్వాయర్లు, నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ కోరారు. తుఫాను ప్రభావం సాధారణ స్థితికి వచ్చే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.







