5 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
కడప: జిల్లాలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు, స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బి.కోడూరు, మైదుకూరు, బి.మఠం, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల మండలాలకు బద్వేల్లోని అంబేద్కర్ గురుకులాన్ని కేంద్రంగా ఖరారు చేసినట్లు తెలిపారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైలవరం, దువ్వూరు, పెద్దముడియం, ప్రొద్దుటూరు మండలాలకు జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కేంద్రంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని కేటాయించినట్లు వెల్లడించారు.






