హైదరాబాద్ కేంద్రంగా అక్రమ అండాల సేకరణ..
9 రాష్ట్రాల్లో ఏజెంట్లు.. 350 మంది బాధిత మహిళలు
హైదరాబాద్: మహిళలతో అక్రమంగా అండాల దందా సాగిస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాదులో పోలీసులు రట్టు చేశారు. నిరుపేద మహిళలకు డబ్బు ఆశచూపి అండాలు సేకరిస్తున్న ఈ ముఠా ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అండాలను సేకరిస్తోంది. సుమారు 9 రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న ప్రధాన నిందితుడు అమిత్ శర్మ నగరంలోని బేగంపేట ప్రకాశ్‌నగర్, సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీలోని నివాసాలు, వసతిగృహాల కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ.. ఇప్పటివరకు సుమారు 350 మంది మహిళల నుంచి అండాలు సేకరించినట్లు పోలీసుల గుర్తించారు. వీరంతా పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో పాటు బిహార్, ఢిల్లీ, అస్సాం, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన బాధిత మహిళలుగా తెలిసింది. వీరికి ఏజెంట్లు రూ.30 వేల కమీషన్, ఆహారం, వసతి, రవాణా ఖర్చుల కింద మరో రూ.40 వేలు చెల్లిస్తున్నట్లు బాధిత మహిళలు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు బేగంపేట, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు చేశారు. అక్రమ అండాల దందా వ్యవహారంలో ఐవీఎఫ్ కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్యుల ప్రమేయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అండాల సేకరణకు వైద్యారోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోనట్లు అధికారులు తెలిపారు.




