హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు ఊరట కలిగేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల వరకూ ఓపీ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దూరప్రాంతాల నుండి వచ్చే రోగులకు ప్రయోజనం కలిగేలా ఎంఆర్ఐ మినహా ఇతర అన్ని రకాల వైద్య సేవలు అదే రోజు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. వైద్య పరీక్షల నివేదికలు సైతం ఒకట్రెండు గంటల్లోనే అందేలా చర్యలతో పాటు అదే రోజు వైద్యులను సంప్రదించి చికిత్స పొందే అవకాశం కల్పించారు. గతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకే ఓపీ ఉండగా.. ఇప్పుడు సాయంత్రం వరకూ వైద్యులు రోగులకు అందుబాటులో ఉండనున్నారు.
