ప్రజలకు ఎన్నికలపై అవగాహన..
శాంతిభద్రతల పరిరక్షణకై సూచనలు
మైదుకూరు, అక్టోబర్ 13: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు మైదుకూరు అర్బన్ సీఐ డి.హాజివలి, మైదుకూరు అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లి గ్రామాన్ని మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలతో మాట్లాడి రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ విభేదాలతో గ్రూపులుగా ఏర్పడి ఘర్షణలకు దిగవద్దని తెలిపారు. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.
